పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై  రౌడీ షీటర్లు, కొందరు యువకులు అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు. భర్తలేని సమయంలో... ఆమెపై రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. కొడుకుకి బాలేదని మందుల కోసం బయటకు రావడమే ఆమె చేసిన పాపమయ్యింది. మృగాళ్ల బారిన పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఏలూరు గ్రామీణ పరిధిలోని నాగేంద్ర కాలనీకి చెందిన ఓ వివాహిత ఇటీవల జ్వరం బారినపడిన తన కుమారుడికి టాబ్లెట్లు తెచ్చేందుకు రాత్రి 10 గంటల సమయంలో సమీపంలోని మెడికల్‌ షాపునకు కాలి నడకన వెళ్లింది. తిరిగి ఇంటికి బయలుదేరగా.. నాగేంద్ర కాలనీకే చెందిన యాకోబు అనే రౌడీషీటర్‌ వచ్చి ఆమెను ఇంటివద్ద దించుతానని చెప్పి తన బైక్‌ ఎక్కమన్నాడు. ఆమె నిరాకరించగా.. చలి గాలిలో ఒంటరిగా వెళ్లడం మంచిది కాదన్నాడు.

AlsoReadవింధుకి ఇంటికి పిలిస్తే... మహిళా వీఆర్ఏతో ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన...

తెలిసిన వ్యక్తే కావడం... కొడుకు జ్వరంతో మంచం మీద ఉండటం గుర్తుకు వచ్చి... కాదనలేక బైక్ ఎక్కింది. అదే అదనుగా చేసుకున్న ఆ రౌడీ షీటర్... దారి మళ్లించి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడికే ముగ్గురు రౌడీ షీటర్లు... మరికొందరు యువకులు సిద్ధంగా ఉన్నారు. ఆమె తలపై కొబ్బరిమట్టలతో దారుణంగా కొట్టారు.

దెబ్బతో విలవిలలాడుతున్న మహిళకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆమెను నగ్నంగా మార్చి... ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా ఆమెపై దారుణానికి పాల్పడుతూనే ఉన్నారు. వారి కిరాతకానికి ఆమె స్పృహ కోల్పోయింది. కాగా... తెల్లవారుజామున ఆమెకు మెలకువ వచ్చింది.

తాను కళ్లు తెరచి చూసేసరికి..ఆ  కిరాతకులంతా మత్తులో జోగుతూ కనిపించారు. తాను లేవలేని స్థితిలో ఉండిపోయింది. దీంతో  ఆ మహిళ ముళ్లపొదల మధ్య నుంచి పాకుతూ నగ్నంగానే రోడ్డుపైకి చేరుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వ్యక్తి ఒకరు ఆమె నిస్సహాయతను గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె మాట్లాడలేకపోయింది. ఆ వ్యక్తి తాను ధరించిన స్వెటర్‌ను ఆమె ఒంటిపై కప్పి వెళ్లిపోయాడు. ఆ మహిళ నడవ లేని స్థితిలోనే ఇంటికి చేరుకుంది.

ఇంటికి చేరిన బాధితురాలు తీవ్ర గాయాలతో నాలుగైదు రోజులపాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. భర్త ఉపాధి నిమిత్తం వేరే ఊళ్లో ఉండటం, ఇద్దరు బిడ్డలు చిన్నవాళ్లు కావడంతో ఆమెను పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. మరోవైపు నిందితులు రౌడీ షీటర్లు కావడం.. తనపై జరిగిన అకృత్యంపై ఫిర్యాదు చేస్తే చంపేస్తారేమోనని బాధితురాలు భయపడింది.

ఈ పరిస్థితుల్లో తరచూ యోగక్షేమాలు తెలుసుకునే బంధువు ఇంటికి రాగా.. బాధితురాలు జరిగిన దుర్మార్గాన్ని వివరించి బావురుమంది. రెండు రోజులుగా ఆ మృగాళ్లు రాత్రివేళ ఇంటికొచ్చి తలుపులు కొడుతున్నారని కూడా చెప్పింది. బంధువు సహకారంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.