గుంటూరు జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టుగా రాష్ట్ర మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టుగా రాష్ట్ర మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ మేరకు ఆమె ప్రకటన కూడా చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టుగా వెల్లడించారు. అయితే పార్టీకి మాత్రం రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని త్వరలోనే పార్టీ అధిష్టానానం వద్దకు వెళ్లి వివరిస్తానని చెప్పారు. పార్టీ క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయవద్దని కోరారు.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేకతోటి సుచరితకు కీలకమైన హోం శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఆమె కేబినెట్ బెర్త్ కోల్పోయారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పలువురని కొనసాగించి.. తనను మాత్రం కేబినెట్ నుంచి తొలగించడంపై మేకతోటి సుచరిత అసంతృప్తికి లోననైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారనే ప్రచారం కూడా సాగింది. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేపట్టింది.
చివరకు వైఎస్ జగన్‌తో భేటీ అయిన తర్వాత మేకతోటి సుచరిత కాస్తా చల్లబడ్డారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సుచరితను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో తెర వెనక చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాల వల్లే సుచరిత ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుచరిత ప్రకటనపై వైసీపీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
