ప్రధాని ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో జగన్ సూచనల ప్రస్తావన: మంత్రి మేకపాటి
కరోనాపై పోరాటంలో దేశానికి ఆంధ్ర ప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు.
అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన సమయమిదేనని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మే 22న ఎమ్ఎస్ఎమ్ఈలకు చెల్లింపులు చేయనున్నట్లు ప్రకటించారు. తయారీ పరిశ్రమల ఏర్పాటుకు భారతదేశమే గమ్యస్థానంగా మారనుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో సీఎం జగన్ కోరిన అంశాలనుప్రస్తావించారని మేకపాటి తెలిపారు. ముఖ్యమంత్రి ముందుచూపుకు, దార్శనికతకు ఇదే నిదర్శనమన్నారు.
''కేంద్ర ప్రభుత్వం కన్నా, ఇతర రాష్ట్రాల కన్నా ముందే ఎమ్ఎస్ఎమ్ఈల కోసం చర్యలు చేపట్టిన తొలి రాష్ట్రం మనదే. ఎమ్ఎస్ఎమ్ఈ, వ్యవసాయరంగం, అనుబంధ పరిశ్రమలలకు కేంద్రం సాయం చేస్తుందని ఆశిస్తున్నాం'' అన్నారు.
''కరోనా నివారణలో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాస్తవాలను ఎప్పటికప్పుడూ స్పష్టంగా చెబుతూ ప్రజలకు భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్'' అని మంత్రి మేకపాటి ప్రశంసించారు.
''కోవిడ్ విజృంభణ నేపథ్యంలో పెట్టుబడులకు ఇతర దేశాల కన్నా భారత్ అనుకూలం. అందులోనూ అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం సూచన మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నాం. పరిశ్రమలు తీసుకురావడానికి ఈడీబీ, టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ముందుకెళతాయి. విధివిధానాల తయారీపై దృష్టి పెట్టాలి'' అంటూ అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశించారు.
''ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం, అనంతర పరిణామాలపైనా మంత్రి అధికారులతో చర్చించారు. విదేశీ పరిశ్రమలపై చర్యలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అనుసరించి ముందుకెళుతున్నాం'' అని తెలిపారు.
''ప్రతిపక్షాల కన్నా ముందే ప్రజాక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి. ప్రభుత్వానికి రెవెన్యూ లోటున్నా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. గ్యాస్ లీకేజీ వ్యవహారంపై విచారణ అనంతరం దోషులెవరైనా ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోము. 13 జిల్లాలలో అన్ని పరిశ్రమలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. క్రమంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం'' అని మంత్రి మేకపాటి వెల్లడించారు.