హైదరాబాద్: టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే మూడేళ్లలోనే ఆ లక్ష్యాన్ని అందుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 

హైదరాబాద్ లోని నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెజాన్ ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని... మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది ముఖ్యమంత్రి స్వప్నమన్నారు.  అమెజాన్ నేతృత్వంలో జరుగుతున్న సాధికారతతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే 'సహేలి' కార్యక్రమం గురించి మంత్రికి వివరణ ఇచ్చారు. 

హస్తకళలు, బొమ్మల తయారీ, వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే మహిళలను ప్రోత్సహించడమే సహేలి కార్యక్రమమని తెలిపారు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకం వరకూ అన్నింటిలో అండగా నిలుస్తున్నామని మంత్రికి అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. 

పరిపాలన, వినూత్న ఆలోచనలన అమలుకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి. ఐ.టీ రంగంలో రాణిస్తున్నది ఎక్కువగా తెలుగువారేనని... ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఏపీకి తిరిగి వచ్చే స్థాయిలో ఐ టీ అభివృద్ధి చేస్తామన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ఐటీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తామని... విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులను అమెజాన్  దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి. 

read more   కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం...వాట్సాప్ నెంబర్లు ఇవే..

''చిన్న చిన్న ఆలోచనలతో  సమయం, వ్యయాల ఆదా అవుతాయి. రాష్ట్రంలో రానున్న 30 నైపుణ్య కాలేజీలలో ఒకచోట అమెజాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నాం. చిన్న సంస్కరణలతోనే ఊహించని అభివృద్ధికి అవకాశం వుంటుంది. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తాం. టెక్నాలజీతో సంక్షేమం, పథకాలను ప్రజల ఇళ్లకు చేరుస్తాం. వినూత్న ఆలోచనలు కొత్త టెక్నాలజీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పెద్దపీట వేస్తాం'' అని మంత్రి తెలిపారు. 

''ఐఎస్‌బీ, అమెజాన్ ల భాగస్వామ్యంతో ప్రజల ప్రాథమిక హక్కులను మరింతగా నెరవేరుస్తాం. నైపుణ్యం, స్టార్ట్ అప్, మెషిన్ లెర్నింగ్, డేటా సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్, వర్క్ ఫ్రమ్ హోమ్, సెన్సార్ ఆధారిత టెక్నాలజీలలో అమెజాన్ భాగస్వామ్యానికి అవకాశాలపై చర్చించాం'' అని మంత్రి వెల్లడించారు. 

అమెజాన్ వెబ్ సర్వీసెస్ వర్చువల్ సమావేశానికి ఐ.టీ శాఖ కార్యదర్శి భాను ప్రకాశ్,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISPL)సంస్థ ఎండీ రాహుల్ శర్మ, స్టేట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ విభాగాధిపతి అజయ్ కౌల్,  పబ్లిక్ పాలసీ హెడ్ లొబొ,  సొల్యుషన్స్ ఆర్కిటెక్చర్ విభాగం నుండి దుర్గాప్రసాద్ కాకరపర్తి హాజరయ్యారు.