కాకినాడ: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును పరామర్శించారు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి. సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో కురసాల కన్నబాబు ఇంట విషాదం చోటు చేసుకుంది.  

గురువారం గుండెపోటుతో సురేష్ మృతిచెందాడు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సోదర వియోగంతో బాధపడుతున్న కురసాల కన్నబాబును పరామర్శించారు.

హైదరాబాద్ నుంచి నేరుగా కాకినాడ వచ్చిన చిరంజీవి కొద్ది నిమిషాలపాటు కన్నబాబు నివాసంలో గడిపారు. కన్నబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం హైదరాబాద్ కు పయనమయ్యారు.  

ఇకపోతే కురసాల కన్నబాబుకు చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. 2009 ఎన్నిక‌ల్లో ప్రజారాజ్యం తరఫున కురసాల కన్నబాబు పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా ఎదిగారు కన్నబాబు. 

ఆ తర్వాత కన్నబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్లీ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.