Asianet News TeluguAsianet News Telugu

తమ్ముడూ లేట్ అయినా పక్కా వస్తా....ట్రెండ్ సెట్ చేద్దాం:జనసేనలోకి చిరు..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తన సత్తా చాటిన పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రయత్నానికి అండగా నిలవాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.  

MEGASTAR CHIRANJEEVI TO JOIN IN JANASENA PARTY
Author
Vijayawada, First Published Oct 16, 2018, 9:12 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తన సత్తా చాటిన పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రయత్నానికి అండగా నిలవాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.  

చిరంజీవి జనసేనలోకి రావడం కాస్త అటూ ఇటూ అయిన పక్కా వస్తారని జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తన సత్తా ఏంటో నిరూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80లక్షల ఓట్లను సాధించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం....రాజ్యసభకు వెళ్లడం, కేంద్రమంత్రిగా పనిచెయ్యడం అన్నీ వరుసవరుసగా జరిగిపోయాయి.

2014 ఎన్నికల తర్వాత చిరంజీవి రాజకీయాల్లో అంతగా కనిపించలేదు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రం ఓ మెరుపు మెరిపించి ఆ తర్వాత మాయమయ్యారు. అయితే 150 చిత్రం ఖైదీనంబర్ 150 సినిమాలో బిజీబిజీగా ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో ఉన్నారు. 

అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కాలపరిమితి ముగిసినా దాన్ని పునరుద్ధరించుకోలేనంత బిజీగా ఉన్నారా అన్న సందేహాలు నెలకొన్నాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకే పార్టీ సభ్యత్వం పునరుద్ధరించుకోలేదని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు కూడా చిరంజీవి ఆ సభకు హాజరుకాలేదు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీని కలుస్తారని భావించినా చిరు ఆ ప్రయత్నమే చెయ్యలేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్రియాశీలకంగా పనిచెయ్యాలని రాహుల్ గాంధీ చిరంజీవిని కోరారు. అయితే చిరంజీవి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 

మరోవైపు తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇమేజ్, అభిమానులు ఉన్న చిరంజీవిని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఒకవైపు రాములమ్మ, మరోవైపు చిరంజీవలతో కాంగ్రెస్ ఓట్లు కొల్లగొట్టు వచ్చని అంచనాలు వేసినా ఆ అంచనాలు పట్టాలెక్కలేదు. 

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకుంటే ఇలా చేసేవారు కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కావాలనే చిరంజీవి పార్టీ సభ్యత్వం కాలపరిమితి ముగిసినా దాన్ని పునరుద్ధరించుకోలేదని వార్తలు గుప్పుమంటున్నాయి. అటు చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సైతం జనసేన పార్టీలో చేరిపోయారు. అటు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో కీలకంగా వ్యవహరించే యర్రా నాగబాబు సైతం జనసేనకు జై  కొట్టారు. 

ఇలా చిరంజీవి చుట్టూ ఉన్న కేడర్ అంతా ఒక్కొక్కరుగా జనసేనలో చేరిపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి అభిమానులు అంతా జనసేన క్యాడర్ గా మారిపోవడం ఇదంతా రాజకీయ ఎత్తుగడ అన్న సందేహం నెలకొంది. ఇప్పటికే పలువేదికలపై అన్న చిరంజీవిపై తన అభిమానాన్ని ప్రేమను బయటపెడుతున్నాడు. సొంత అన్నయ్యను కాదని టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ చిరంజీవి అభిమానులదేనంటూ అన్నయ్య అభిమానులను అన్నయ్యను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

అంతేకాదు అన్నయ్యను కాదని టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకువచ్చానని చెప్పారు. అలా కాకపోతే ఏమయ్యి ఉండేదంటూ అభిమానుల్లో డౌట్ రేకెత్తిస్తున్నారు. అన్నయ్య చిరంజీవి, తాను కలిస్తే ఎలా ఉంటుందో ఊహించాలంటూ పరోక్షంగా తమ బలాన్ని చూపిస్తున్నారు. తాను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అలాంటిది అన్నయ్య సాయంతో తాను బరిలోకి నిలిస్తే నిర్ణయాత్మక శక్తిగా మారలేమా అంటూ పవన్ అభిమానులతో చర్చించినట్లు సమాచారం. 

పవన్ కళ్యాణ్ పలు వేదికలపై అన్నయ్యపై తన ప్రేమను అభిమానాన్ని చూపిస్తుండటంతో చిరంజీవిలో మార్పు వచ్చిందని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి జనసేనకు జై కొట్టాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవికి వెన్నుదన్నుగా నిలిచారు. చిరంజీవి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో ఆయనతో కలిసి నడిచేందుకు చిరంజీవి నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. 

అటు పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవి పార్టీలోకి వస్తే ఆయనకు గౌరవ ప్రదమైన బాధ్యత కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారట. చిరంజీవిని జనసేన గౌరవాధ్యక్షుడి హోదాలో కూర్చోబెట్టనున్నారట. చిరంజీవి అనుభవాలను, వ్యూహాలను పవన్ వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి అభిమానులు జనసేనకు జై కొడుతున్న తరుణంలో మిగిలిన వారు కూడా చిరంజీవి రాకపోతే జనసేనకు జై కొడతారని ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే చిరంజీవిని అటు టీడీపీ కూడా ఆహ్వానిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసిన గంటా శ్రీనివాసరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, కామినేని శ్రీనివాసులు చిరంజీవిని టీడీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు సైతం చిరంజీవిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ తెరవెనుక పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. 

వాస్తవానికి జనసేన పార్టీ రోజురోజుకు పుంజుకుంటోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు నిదర్శనమే రాజమహేంద్రవరంలోని జనసేన కవాతు. అంతేకాదు పార్టీలోకి కీలక నేతలు ఒక్కొక్కరు వచ్చి చేరుతుండటంతో పార్టీ మరింత బలోపేతం చెందుతుంది. 

పవన్, చిరంజీవి అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం జనసేనకు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా జనసేనకే జై కొట్టాలని తమ్ముడికే అండగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిరంజీవి జనసేనలోకి రావడం ఖాయమని అన్నయ్య తమ్ముడు కలిసి ట్రెండ్ సెట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ కి చిరంజీవి రాజీనామా..?

Follow Us:
Download App:
  • android
  • ios