మొన్నటి వరకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శల వర్షం కురిపించిన మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు రూట్ మార్చారు. బాలకృష్ణను వదిలేసి.. ఆయన అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు మంత్రి లోకేష్ పై పడ్డారు. తాజాగా లోకేష్ ని టార్గెట్ చేస్తూ.. యూట్యబ్ లో వీడియో విడుదల చేశారు.

తన వ్యక్తిగత యూట్యూబ్ అకౌంట్ ద్వారా రాజకీయాలపై, కొందరు నాయకులపై తనకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నట్లు తెలిపారు. తాను చేసే విమర్శలు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తనకు ఉన్న ఆసక్తితో యూట్యూబ్ లో మై ఛానెల్ నా ఇష్టం అనే ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఛానెల్ లో తాను నేటికి వచ్చినట్లుగా వ్యక్తిగతంగా ఇతరులను దూషించను అని.. ఎవరిపై పడితే వారిపై విమర్శలు  చేయనని కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయపరమైన విమర్శలు చేస్తానని.. వ్యక్తిగతంగా విమర్శనని స్పష్టం చేశారు.

తన మొదటి వీడియోలో మంత్రి లోకేష్ ని ఎంచుకున్నట్లు చెప్పారు. తాను చిన్నప్పుడు పిల్లలు దేవుడు చల్లనివారే  అంటూ పాట వినేవాడినని.. ఎందుకంటే పిల్లలు అబద్దాలు ఆడరని ఆయన అన్నారు. ఒకసారి ఈ పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడో వినండి అంట.. లోకేష్ ఓ సందర్భంలో మాట్లాడిన వీడియోని ప్లే చేశారు. అందులో లోకేష్..‘‘ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎలాంటి అవినీతి, బంధుప్రీతి, మత, కుల పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీనే’’ అంటూ పేర్కొన్నారు.

 

లోకేష్ చేసిన కామెంట్స్ పై చూశారు కదా.. ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడాడో.. నిజాన్ని నిర్బయంగా ఒప్పుకునే దమ్ము తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎవ్వరు లేరు లోకేష్ బాబు గారు. మీరు గ్రేట్ అంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు.