జనసేనకు బిగ్ షాక్.. మేడా గురుదత్త ప్రసాద్ రాజీనామా..
జనసేన పార్టీకి ఆ పార్టీ నేత మేడా గురుదత్త ప్రసాద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 100మంది రాజీనామా చేశారు.

తూర్పు గోదావరి : పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు తూర్పుగోదావరి జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. జనసేన నేత మేడా గురుదత్త ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో వంద మంది రాజీనామాలు సమర్పించారు. మేడా గురుదత్త ప్రసాద్ గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. ఆదివారంనాడు కోరుకొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడతారని.. కానీ, తమ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుసుకోలేకపోయారని అన్నారు. ఇది చాలా బాధాకరమని.. ఈ కారణంగానే తాను పార్టీని వదిలివేయాల్సి వస్తుందని మేడా గురుదత్త ప్రసాద్ ఆవేదనతో చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో షాక్..ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్..
తాను మొదట ప్రజారాజ్యం పార్టీలో ఉన్నానని ఆ తర్వాత జనసేన పార్టీలో పని చేశానని దాదాపు 16 ఏళ్ల పాటు తాను ఎంతో అంకితభావంతో పనిచేశానని గురుదత్త ప్రసాద్ అన్నారు. కానీ, పార్టీలో ఒంటెద్దుపోకడలు ఉన్నాయని.. అంతర్గతంగా ప్రజాస్వామ్యం కొరవడిందని ధ్వజమెత్తారు. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు.. అద్దేపల్లి శ్రీధర్, తోట చంద్రశేఖర్, రాజు రవితేజ, జయలలిత దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కారణంతోనే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పినట్టుగా గుర్తు చేశారు.
వారందరితో పోల్చుకుంటే తాను చాలా చిన్న వాడినని చెప్పుకొచ్చారు. తాను అధిష్టానం అపాయింట్మెంట్ కోసం 87 రోజులుగా ఎదురు చూస్తున్నానని.. కానీ, తనను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పించారని ఆ విషయం తనకు తెలియజేయలేదని అన్నారు. ఈ అవమానాన్ని భరించలేక చివరికి రాజీనామా చేస్తున్నానని.. గత నెల 30వ తారీఖునే లేఖ రాశానన్నారు. కానీ, దీనికి ఎవరు స్పందించలేదనీ చెప్పుకొచ్చారు.పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ తీరు కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మేడా చెప్పారు.
మేడా గురుదత్త ప్రసాద్ తో పాటు జనసేన కోరుకొండ మండల అధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్న దొర, ఉపాధ్యక్షుడు నాగారం భాను శంకర్ ,నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబితో పాటు 100 మంది జనసేనకు గుడ్ బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడ గురుదత్త ప్రసాద్ తెలిపారు. స్థానిక నాయకత్వం వన్ మ్యాన్ షోలా చేస్తోందని.. దీంతోపాటు పార్టీలో నెలకొన్న ఇతర సమస్యల కారణంగానే ఈ రాజీనామాలన్నారు. తాను ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు.