ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి పార్టీ మార్పుపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

ఆయనతో వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. కృష్ణమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు... ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేత పోతుల సురేశ్ మండిపడ్డారు. కలిసి పనిచేయాలని అధినేత ఎన్నిసార్లు సూచించినా.. ఆమంచి-పోతుల వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకు రాలేదు.

అంతేకాకుండా కీలక నేతలు, కార్యకర్తలను సైతం పోతుల.. ఆమంచికి దూరం చేశారు. దీనికి తోడు కొన్ని వ్యవహారాల్లో తన అనుచరులు, మద్ధతుదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఆమంచి ఆగ్రహంగానే ఉన్నారు.

టీడీపీలో తనను పట్టించుకోవడం లేదని ఆవేదనలో ఉన్న ఆయన పార్టీని వీడాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఒక కంట కనిపెడుతున్న వైసీపీ నేతలు ఆమంచితో సంప్రదింపులు జరిపారు.

ఈ నేపథ్యంలో కృష్ణమోహన్.. వైసీసీ తీర్థం పుచ్చుకోనున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.