విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మత్తి వెంకటేశ్వరరావు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి, ఇన్‌చార్జ్‌ పదవికి, పీసీసీ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. 

స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్తి శుక్రవారం ఆ విషయం చెప్పారు. ఇప్పటివరకూ తనకు కాంగ్రెస్‌ పార్టీలో సహకరించిన ఏపీసీసీ, డీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, ధనేకుల మురళీమోహన్‌కు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 

రాజీనామా లేఖను పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు పంపించినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న మత్తి ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజీనామా చేసి జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.