చట్టంలో ఉన్న లొసుగులను కొన్ని హోటళ్ళ వాళ్ళు బాగా సొమ్ము చేసుకుంటున్నారు. అది కూడా అలా ఇలా కాదు. కస్టమర్ల గుండెలు గుభేలు మనేలా. కొన్ని హోటళ్ళకు వెళ్ళి కూల్ డ్రింకులు తాగాలన్నా, మంచినీళ్ళ బాటిల్ కొని భోజనం చేయాలంటే ఒకరివద్ద  ఉన్న పర్సులో డబ్బు సరిపోదు. ఎందుకంటే, అక్కడి ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి మరి.

ఎక్కడైనా 300 ఎంఎల్ కూల్ డ్రింక్ ఎంతుంటుంది? మహా అయితే ఏ రూ. 30 లేకపోతే రూ. 40 ఉంటుంది. మిగిలిన చోట్ల సంగతి పక్కన బెడితే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న వైస్రాయ్ హోటల్లో మాత్రం రూ. 195. జిఎస్టీతో కలుపుకుంటే రూ. 230. ఇక, 1 లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ. 195. గ్రీన్ టీ ధరెంతో తెలుసా ? రూ. 225 మాత్రమే. ఈ లెక్కన నలుగురు సభ్యులుండే ఓ ఫ్యామిలీ ఈ హోటల్ కు వెళ్ళి తృప్తిగా భోజనం చేయాలంటే ఒక పూటకు కనీసం రూ. 7 వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఒక్క హోటల్లోనే కాదు చాలా హోటళ్ళలో, సినియా థియేటర్లలో పరిస్థితి ఇదే విధంగా ఉంది.

ఎంఆర్ఫి ధర కన్నా మించి అమ్మకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా ఎవ్వరూ లెక్క చేయటం లేదు. పైగా జిఎస్టీ పరిధిలో లేని వాటికి కూడా జిఎస్టీ పేరుతో బిల్లులు వేసేసి కస్టమర్లను బాదేస్తున్నారు. హైదరాబాద్ లో తూనికలు, కొలతల శాఖ ఉన్నతాధికారులు వైస్రాయ్ హోటల్లో తనిఖీలు చేసారు. అక్కడి ధరలు చూసి వాళ్ళకే కళ్ళు తిరిగాయట. లీటర్ నీళ్ళ బాటిల్, 300 ఎంఎల్ కోక్, ఓ గ్రీన్ టీ బిల్లు ఏకంగా రూ. 725. కోక్ టిన్ అసలు ధర కేవలం రూ. 35 మాత్రమే. హోటల్లోని ధరలను చూసిన అధికారులు ఫైన్ వేసి వచ్చేసారు. అంతకన్నా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు?