పెళ్లి అనుకున్న నాటి నుంచే ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినా పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక దంపతులిద్దరూ సంతోషంగా ఉంటారని అందరూ భావించారు. కానీ.. వారి మధ్య గొడవలు మాత్రం తగ్గలేదు. ఇటీవల ఆ దంపతులకు కవల పిల్లలు కూడా పుట్టారు. వారికి తలనీలాలు ఇచ్చి వచ్చిన అనంతరం భార్య, భర్తలు మరోసారి వివాదానికి దిగారు. చివరకు మనస్థాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. .తొట్టంబేడు మండలం చిట్టత్తూరుకు చెందిన రైతు చెంగారెడ్డి తన కుమార్తె  ప్రియాంక(25)ను శ్రీకాళహస్తికి చెందిన బాలాజీతో వివాహం జరిపించారు. బాలాజీ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. వీరి నిశ్చితార్థం రోజున ఇరు కుటుంబాల మధ్య పెద్ద వివాదమే చోటుచేసుకుంది. పెళ్లి క్యాన్సిల్ అవుతందని అందరూ భావించారు. అయితే.. పెద్దలు వాళ్లలో వాళ్లే సర్దుకొని పెళ్లి జరిగేలా చేశారు.

పెళ్లి జరిగినా వారి మధ్య పెద్దగా సఖ్యత లేదు.ఇటీవల ప్రియాంకకు కవల పిల్లలు జన్మించారు. ఆ పిల్లలకు శ్రీకాళహస్తిలో తలనీలాలు సమర్పించి పిల్లలతోకలిసి అత్తారింటికి వెళ్లింది. అక్కడ భర్త, అత్తతో ఆమెకు గొడవ అయ్యింది.దీంతో మనస్థాపానికి గురైన ప్రియాంక ఆత్మహత్య చేసుకొంది. 

కన్నకూతురు ఆత్మహత్య ప్రియాంక తల్లిదండ్రులను కుంగదీసింది. తమ కుమార్తె చావుకి అత్తింటివారే కారణమంటూ వారిపై ఘర్షణకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.