వైజాగ్ బీచ్‌లో వివాహత మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. నెల్లూరులో గుర్తించిన పోలీసులు.. అదే కారణమా..?
విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి వివాహిత కనిపించకుండా పోయిన కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బీచ్ నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రియ.. తాజాగా నెల్లూరులో ప్రత్యక్షం అయింది.
విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి వివాహిత కనిపించకుండా పోయిన కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బీచ్ నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రియ.. తాజాగా నెల్లూరులో ప్రత్యక్షం అయింది. ఆమె నెల్లూరులో మరో యువకుడితో కలిసి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే ప్రియుడి కోసమే ఆమె భర్త ఫోన్ చూస్తున్న సమయంలో అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఎన్‌ఎడి జంక్షన్‌కు చెందిన శ్రీనివాసరావు, సాయిప్రియ దంపతులు సోమవారం తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో కాసేపు గడిపిన తర్వాత.. ఆ దంపతులు నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు.
ఆ సమయంలో శ్రీనివాసరావు తనకు ఏదో ముఖ్యమైన మెసేజ్ వచ్చిందని నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు. అయితే ఫోన్ చూడటం పూర్తయ్యాక చూస్తే తన భార్య కనిపించలేదు. ఎంత వెతికినా ఆమె జాడ లేకపోవడంతో శ్రీనివాసరావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె నీటిలో గల్లంతు అయి ఉంటుందని భావించారు. అప్పటికే చీకటి పడిపోవడంతో పోలీసులు సరైన సోదాలు నిర్వహించలేకపోయారు. అయితే మంగళవారం ఉదయం తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి హెలికాప్టర్లు, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి రెండు పెట్రోలింగ్ నౌకలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే వారు సాయిప్రియ గురించిన ఎలాంటి ఆచూకీని కనుగొనలేకపోయారు.
మరోవైపు పోలీసులు సాయిప్రియ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికైనా వెళ్లిందా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాయి ప్రియ నెల్లూరులో మరో యువకుడితో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
ఇక, సాయిప్రియకు శ్రీనివాసరావుతో 2020 జూలై లో వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారని.. జూలై 25న తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారని పోలీసులు చెప్పారు. సోమవారం ఉదయం సింహాచలం వెళ్లి .. సాయంత్రం సరదాగా గడిపేందుకు ఆర్‌కే బీచ్‌కు వచ్చినట్టుగా శ్రీనివాసరావు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు.