వివాహిత దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అతి కిరాతకంగా చంపేశారు. కాగా..  ఆమె భర్త ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు. దీంతో.. పోలీసులు ఆమె భర్త ఎక్కడ ఉన్నాడని వెతికే పనిలో పడ్డారు. ఈ సంఘటన  ప్రకాశం జిల్లా లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లక్కవరం ఎస్సీ కాలనీకి చెందిన మద్దుమాల పద్మ(38), భాస్కర్‌రావు భార్యభర్తలు. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కాగా... కరోనా కారణంగా ఇంట్లో ఉంటూనే ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలంలోని పూనూరులో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. కంగారు పడిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు  కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో పద్మ శవమై కనిపించింది. కాగా.. ఆమెతోపాటే వెళ్లిన భర్త  భాస్కర్ రావు మాత్రం కనిపించకుండా పోయాడు. కాగా.. ఆమెను భర్తే హత్య చేశాడా.. లేదా మరెవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధిస్తూ ఉండేవాడని, అతడే చంపి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకీ తెలిస్తే గానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.