భర్తకు మతిస్థిమితం సరిగాలేదని సొంత మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక భర్తను వదలేసి... మేనల్లుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఆ నిర్ణయమే ఆమె ప్రాణం తీసింది. పెళ్లి చేసుకోమని అడుగుతోందని మేనల్లుడే ఆమెను కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఏలూరులోని శనివారపుపేట అప్పారావునగర్ కి చెందిన నాగమణికి కొంత కాలం క్రితమే వివాహమైంది. ఆమె భర్త శివాజీ ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యాడు. మతిస్థిమితం సరిగాలేదు. దీంతో... ఆమె భర్తను కాదని... వరసకు మేనల్లుడు అయ్యే సంతోష్ కుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

తరచూ ఇద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. అయితే... మేనల్లుడు సంతోష్ సాన్నిహిత్యం ఆమెకు బాగా నచ్చింది. దీంతో... భర్తను శాశ్వతంగా వదిలేసి సంతోష్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయం సంతోష్ కి చెప్పింది. తరచూ పెళ్లి చేసుకోమని  ఒత్తిడి చేసింది. దీంతో.. ఆమెను వదిలించుకోవాలని సంతోష్ భావించాడు.

ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన రాత్రి ఆమెను దొండపాడు సమీపంలోని పంట బోదె వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తలను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఆమె శవంపై ఓ చాపను కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమీ తెలియనట్లుగా షిరిడి వెళ్లిపోయాడు.

కాగా... మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోస్టుమార్టం తర్వాత హత్యగా గుర్తించారు. విచారణలో సంతోషే నిందితుడు అని తేలింది. అతనిని అదుపులోకి తీసుకున్నారు.