చదువుకుంటున్న అమ్మాయి కి సడెన్ గా పెళ్లి చేశారు. మంచి సంబంధమని చెప్పి.. వెంటనే పెళ్లి చేశారు. అయితే.. పెళ్లైన నెలకే సదరు యువతి గర్భం దాల్చింది. కాగా.. దీంతో.. యువతిపై అత్తింటివారు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పలు రకాలుగా అవమానిస్తూ వచ్చారు. బిడ్డ పుట్టాక వేధింపులు తగ్గుతాయని భావించింది. కానీ.. ఆమెకు మళ్లీ అవమానాలు ఎదురౌతూనే ఉన్నాయి. దీంతో.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన  హిందూపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మడకశిరకు చెందిన అర్షియా (26) కోటి ఆశలతో వైద్య విద్య కళాశాలలో విద్యార్థిగా చేరింది. మరో రెండేళ్లలో కోర్సుపూర్తి అవుతుందనుకుంటున్న తరుణంలో హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నూరుల్లా పెళ్లి సంబంధం వచ్చింది. మంచి సంబంధమని నమ్మిన అర్షియా తల్లిదండ్రులు 2019 నవంబర్‌లో నూరుల్లాకు అర్షియానిచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.5 లక్షలు, అర కిలో బంగారు నగలు అందజేశారు.

వివాహనంతరం భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ అత్తారింటిలో అడుగుపెట్టిన అర్షియా అంచనాలు తలకిందులయ్యాయి. ప్రతి విషయంలోనూ భర్తతో పాటు అత్తింటి వారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమె పై భర్త అనుమానం పెంచుకోవడం మొదలుపెట్టాడు.

ఆ వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోయాయి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వేధింపులు తగ్గలేదు. దీంతో.. ఆమె ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు వాధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.