ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పెళ్లైన ఆమె భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తోంది. కాగా... తనతో విడిపోయిన తర్వాత కూడా భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేయడం గమనార్హం. ఆమె చనిపోయిన రెండు రోజులు తర్వాత చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన దేవరాపల్లి అప్పలనర్సమ్మ(38) 15 సంవత్సరాల క్రితం విశాఖకు చెందిన సామాళ్లుతో వివాహమైంది. కాగా... వీరికి పిల్లలు లేరు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో... ఐదు సంవత్సరాల క్రితం వీరు కోర్టు సమక్షంలో విడాకులు తీసుకొని విడిపోయారు.

Also Read మరదలితో వివాహేతర సంబంధం...టీడీపీ నేతకు జైలు శిక్ష

అయితే... అప్పలనర్సమ్మకు భరణం ఇవ్వాల్సిందిగా విడాకుల సమయంలో సామాళ్లుకి కోర్టు సూచించింది. అయితే... కొన్ని నెలలుగా సామాళ్లు... భార్యకు భరణం ఇవ్వడం మానేశాడు. దీంతో... ఆమె భరణం అందడం లేదని కోర్టును ఆశ్రయించింది. 

ఈ నేపథ్యంలో అప్పలనర్సమ్మ ఫోన్‌ ఆదివారం నుంచి స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె సోదరి పద్మ అనుమానంతో మంగళవారం ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడం.., లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సాయంతో ఇంటి తాళం పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పలనర్సమ్మ రక్తపుమడుగులో ఉండడంతో వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. 

ఫోర్తుటౌన్‌ సీఐ ఈశ్వరరావు తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం పక్కన లభించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల, చెవుల మీద గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మెడలో పుస్తెల తాడు లేకపోగా, కిందన రెండు పుస్తెలు లభించాయి. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

కాగా... తనను రిమాండ్ కి పంపిందనే కోపంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.