గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ  నెలకొంది. తమదే అధికారమని తెలుగుదేశం పార్టీ, కాదు కాదు తామే అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాలో ఉంది. 

అంతేకాదు జనసేన పార్టీ సైతం తమదే అధికారం అంటూ చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని రకరకాల సర్వేలు వెలువడుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కంటే ఆ పార్టీ కీలక నేత మర్రి రాజశేఖర్ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. 

వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తుంటే చాలు ఆయన  మెుఖంలో ఆనందానికి అంతేలేకుండా పోతుందట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలో మెుదటి స్థానం కొట్టేయోచ్చని ఆశ. 

చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ ని మంత్రిని చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ అధికారంలోకి రావాలని మర్రి రాజశేఖర్ కోరుకుంటున్నారట. 

ఇకపోతే మర్రి రాజశేఖర్ కు రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉంది. గతంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు రాజశేఖర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు వైఎస్ జగన్. 

గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీలో మర్రి రాజశేఖర్ ను సభ్యుడిగా నియమించారు వైఎస్ జగన్. అంతేకాదు ఎన్నికల తర్వాత కూడా కీలక బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. 

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ,గురజాల, నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్ గా నియమించారు. మెుత్తానికి కాలం కలిసొస్తే తాను మంత్రి అవుతానని మంచి ఉత్సాహంలో ఉన్నారట మర్రి రాజశేఖర్. మరి ఆయన కోరిక తీరాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.