ప్రకాశం జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం మార్కాపురం. ఇక్కడ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసిపిదే విజయం. ఈసారి మరో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఆ పార్టీ వుంది. తెలుగుదేశం పార్టీ కూడా మార్కాపురంపై కన్నేసింది. ఇరుపార్టీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  

మార్కాపురం రాజకీయాలు :

మార్కాపురం అసెంబ్లీ మొదటినుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ స్థానాన్ని వైసిపి కైవసం చేసుకుంది. పోటీచేసిన రెండుసార్లు (2014, 2019) మార్కాపురంలో వైసిపిదే విజయం. టిడిపి ఆవిర్బావం నుండి ఇప్పటివరకు ఆ పార్టీ కూడా గెలిచింది రెండుసార్లే (1983, 2009).

ఇదిలావుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు షిప్ట్ చేసింది వైసిపి అదిష్టానం. ఇదేవిధంగా గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురంకు మార్చారు. ఇలా ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల అభ్యర్ధులను మార్చి ప్రయోగం చేసింది వైసిపి.

మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. మార్కాపురం
2. పొదిలి
3. కొనకలమిట్ల
4. తర్లుపాడు

మార్కాపురం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,10,105

పురుషులు - 1,06,148
మహిళలు ‌- 1,03,949

మార్కాపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గిద్దలూరు, మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేలను పరస్పరం మార్చింది వైసిపి. ఇలా ఈసారి మార్కాపురం బరిలో అన్నా రాంబాబు నిలిచారు. ఇక్కడి ఎమ్మెల్యే గిద్దలూరుకు షిప్ట్ అయ్యారు.

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మరోసారి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మార్కాపురం బరిలో నిలిపింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా వరుసగా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్నారు నారాయణరెడ్డి. అయినప్పటికీ ఆయనపైనే నమ్మకం వుంచిన టిడిపి అదిష్టానం మరోసారి అవకాశం ఇచ్చింది. 

మార్కాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

మార్కాపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,78,712 (85 శాతం) 

వైసిపి - కుందూరు నాగార్జునరెడ్డి - 92,680 ఓట్లు (51 శాతం) - 18,667 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి- కందుల నారాయణ రెడ్డి - 74,013 ఓట్లు (41 శాతం) - ఓటమి

మార్కాపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,62,328 (81 శాతం)

వైసిపి - జంకె వెంకట్ రెడ్డి - 82,411 (50 శాతం) ‌- 9,802 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - కందుల నారాయణ రెడ్డి - 72,609 (44 శాతం) ఓటమి