Margadarshi Chit Fund: మార్గదర్శికి మరోసారి ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. దాదాపు రూ. 242 కోట్ల విలువైన  చరాస్తులను జప్తు చేసింది.

Margadarsi Chit Fund: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ మరోసారి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాలు జరిగాయంటూ సంస్థ యాజమాన్యంపై సీఐడీ సోదాలు నిర్వహించి, పలు కేసులు నమోదు చేయటంతో పాటు కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూ.242 కోట్ల చరాస్తులను జప్తు చేసింది ఏపీ సీఐడీ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై A1గా రామోజీరావు, A2గా శైలజా కిరణ్‌ అలాగే.. మా­ర్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచీల మేనేజర్లపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు తెలిపింది.

ఈ కేసులో గత నెల చివరిలో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను సీఐడీ అటాచ్‌ చేసింది. మార్గదర్శికి సంబంధించిన రూ.793.50కోట్ల విలువైన చరాస్తులను సీజ్ చేసినట్టు ఏపీ హోంశాఖ వెల్లడించింది. ఈ కేసు తేలేవరకూ ఎటువంటి లావాదేవీలు చేయకుండా చేసింది. ఇందులో సంస్థ చైర్మన్‌, ఎండీ, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్టు, వారిని నిందితులుగా పేర్కొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐడీ తెలిపింది.

చిట్స్ ‌ద్వారా సేకరించిన సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు మార్గదర్శి వివరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1989 చిట్స్‌ గ్రూపులు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నట్టు సీఐడీ తెలిపింది. అయితే.. ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని సీఐడీ వివరించింది. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గదర్శి శాఖల్లో అక్రమాలు వెలుగు చూశాయని సీఐడీ వెల్లడించింది.