విశాఖపట్నం: మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన గుమ్మిరేవుల వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు భవాని అనే మరో మహిళా నక్సలైట్ కూడా గాయపడింది.

అరుణకు చికిత్స అందించి కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అరుణ పోలీసుల అదుపులో లేదని డీజీపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. భవానీ మాత్రమే స్పెషల్ టీమ్ కు చిక్కిందని ఆయన చెప్పారు. మన్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నెల 21వ తేదీనుంచి మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గాలింపు చర్యల సందర్భంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

రాజమండ్రి ఆస్పత్రిలో అరుణకు పోలీసులు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. చికిత్స ముగిసిన తర్వాత అరుణను విచారిస్తామని పోలీసులు అంటున్నారు.