Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, నేదురుమల్లి.. మావోల పంజాకి చిక్కిన వారి జాబితా పెద్దదే

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు సివేరి సోమను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపడంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.  

maoist attacks on famous people
Author
Araku, First Published Sep 24, 2018, 3:33 PM IST

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు సివేరి సోమను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపడంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.  ప్రభుత్వం అనుసరించి కఠిన వైఖరితో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని భావిస్తోన్న సమయంలో ఇద్దరు నేతలు హత్యకు గురికావడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో మావోల చేతుల్లో హతమైన వారి కోసం నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. 1989లో ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై జరిగిన దాడికి ప్రతీకారంగా.. నల్లమళ దళం దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్యను కాల్చి చంపారు.

1995లో ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డిని ఆయన ఇంటి వద్దే నక్సల్స్‌ కాల్చారు.. ఆ తర్వాతి ఏడాది.. 2000లో నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై మందుపాతర పెట్టి హత్య చేశారు. 1997లో నాడు ఎంపీగా ఉన్న నిమ్మకాయల అయ్యన్నపాత్రుడిపై దాడి జరగ్గా.. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకోగా.. ఆయన సోదరుడు చింతకాయల శ్రీను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.

1999లో మాజీ స్పీకర్ శ్రీపాదరావును కరీంనగర్‌లో హత్య చేశారు. అదే సంవత్సరం ఆగస్టులో కర్నూలు జిల్లా ఆత్మకూరు‌లో అప్పటి ఎమ్మెల్యే బుడ్డా వెంగళ్ రెడ్డిని, ఆపై రోజుల తర్వాత వ్యవధిలో సిర్పూర్ కాగజ్ నగర్ ‌పాల్వాయి పురుషోత్తమ్‌ రావు..2001లో దేవరకొండ వద్ద ఎమ్మెల్యే రాగ్యా నాయక్‌ను.. 2005లో మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ పేట సమీపంలో మాజీ మంత్రి డీకే అరుణ తండ్రి ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని హత్య చేశారు.

అయితే ఇక్కడ అన్నల చేతులో చనిపోయిన వారే కాదు.. తృటిలో మిస్సయిన వారు కూడా ఉన్నారు. 2003లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హతమార్చేందుకు అలిపిరి వద్ద మందుపాతరలు పెట్టగా... సీఎం తృటిలో తప్పించుకున్నారు.

అయితే ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం 2007లో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 2004లో కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు మావోల దాడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios