సభకు తప్పని సరిగా హాజరవ్వాల్సిందిగా మావోయిస్టులు ఖచ్చితమైన కబురు పంపటం వల్ల గిరిజనులు కూదా భయంతోనైనా భారీ ఎత్తునే హాజరయ్యారు.

మావోయిస్టులు ప్రభుత్వానికి సవాలు విసిరారు. అధికార పక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలకు ప్రజాక్షేత్రంలో తీవ్రమైన శిక్షలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్న విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ఏరియాలోని జీకె వీధి, కొయ్యూర మండలాల సరిహద్దు గ్రామమైన బూదిరాళ్ళ పంచాయితీలో భారీ బహిరంగ సభ నిర్వహించటం గమనార్హం. సభ జరిగిన ప్రాంతం మొన్నటి ఎన్ కౌంటర్ స్ధలానికి దగ్గరలోనే ఉన్నట్లు సమాచారం.

 పోయిన నెలలో గ్రేహౌండ్స్ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లో ఒకేసారి 25 మంది మవోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ తర్వాత కూడా పోలీసు దళాలు ఆంధ్ర ఒడిస్సా సహరిద్దు (ఏఓబి) ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల అగ్రనేత రామకృష్ణ ఆచూకీ కోసం పోలీసులు ఒకవిధంగా ఏఓబి ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

బుధవారం సాయంత్రం మావోయిస్టులు సభ నిర్వహించన ప్రాంతం చుట్టు పక్కల ఇంకా పోలీసు దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అయితే, సభ నిర్వహించిన పంచాయితీ దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉండటంతో పాటు ఒడిస్సా గ్రామాలకు సరిహద్దు కూడా కావటంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. అదీ కాకుండా బహిరంగసభ జరిపిన ప్రాంతానికి చుట్టుపక్కల మావోయిస్టులు ల్యాండ్ మైన్స్ ఏర్సాటు చేసుకున్నట్లుగా పోలీసులకు ముందస్తు సమాచారం కూడా అందటంతో ఎవరు కూడా సభ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లటానికి ఇష్ట పడలేదు.

బుధవారం సభ విషయమై ముందుగానే పరిసర గ్రామాల గిరిజనులకు సమాచారం ఇవ్వటంతో పాటు సభకు తప్పని సరిగా హాజరవ్వాల్సిందిగా మావోయిస్టులు ఖచ్చితమైన కబురు పంపటం వల్ల గిరిజనులు కూదా భయంతోనైనా భారీ ఎత్తునే హాజరయ్యారు. ఆ సభలో మావోయిస్టుల తరపున మాట్లాడుతూ టిడిపి, భాజపా నేతలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు చేసారు. భూటకపు ఎన్ కౌంటర్ చేసిన ప్రభుత్వం, పోలీసులను ప్రజా క్షేత్రంలో శిక్షించక మానమని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. మావోయిస్టుల హెచ్చరికలతో ఎప్పుదేమౌతుందోోనన్న భయంతో అధికార పార్టీల నేతలు భీతిల్లుతున్నారు.

పోలీసులకు తమ ఉనికి గురించి ఎవ్వరూ చెప్పవద్దని, బెచితే శిక్షకు గురి అవ్వకతప్పదని కూడా గిరిజనులను హెచ్చరించినట్లు సమాచారం. దాంతో పై ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల పరిస్ధితి ‘ముందు చూస్తే నుయ్యి, వెనుక చూన్తే గొయ్యి’ అన్నట్లుగా తయారైంది.