మీడియాతో జాగ్రత్తగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, సామాజిక వర్గంలోని మద్దతు దారులు పవన్ను హెచ్చరిస్తుండటం గమనార్హం.

పవన్ కల్యాణ్ ను మీడియా హైజాక్ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఎందుకంటే, మొన్నటి వరకూ పెద్దగా పట్టించుకోని మీడియాలోని బలమైన వర్గం ఒక్కసారిగా పవన్ కు బాహాటంగా మద్దతు ప్రకటించటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటి వరకూ ఎన్ టివి, టివి9, ఈనాడు పవన్ పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబునాయుడుకు పవన్ మద్దతుగా నిలబడినంత వరకూ ఆకాశానికి ఎత్తేసాయి. అదే పవన్ ఎప్పుడైతే చంద్రబాబుపై కామెంట్లు చేయటం మొదలుపెట్టారో వెంటనే పవన్ కు ప్రాముఖ్యత ఇవ్వటం మానేసారు.

అయితే, హటాత్తుగా కాటమరాయడు సినిమా కార్యక్రమంలో టివి9, ఎన్టీవికి చెందిన రవిప్రకాశ్, నరేంద్ర చౌధరిలు పాల్గొని బహిరంగంగా మద్దతు పలికారు. దానికితోడు ఈనాడు ఆదివారం స్పెషల్లో కవర్ స్టోరిగా పవన్ గురించి రాసారు. ఇవన్నీ చూస్తుంటే వీరుముగ్గురు పవన్ను హైజాక్ చేస్తున్నారా అన్న అనుమానాలు అందరిలోనూ బయలుదేరాయి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ను తమ సంస్ధలకు వాడుకునేందుకేనా లేక చంద్రబాబుకు అనుకూలంగా మలిచేందుకు పూనుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినపుడు కూడా ఇదే విధంగా జరగటాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. అప్పుడు కూడా పలు మీడియా సంస్ధలు చిరంజీవి బహిరంగ సభలను కవర్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్ధలైతే చిరంజీవికి ప్రచారం కల్పంచేందుకు చంద్రబాబును పక్కన బెట్టేసారు. ప్రచారం కాస్త అతికావటంతో చిరంజీవి కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అంటూ ముద్ర పడిపోయింది. దాంతో జనాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. జనాల్లోని వ్యతిరేకతచూసి మీడియా సంస్ధలు చిరంజీవిని పక్కన పడేసాయి. దాంతో చిరంజీవి ఎటూ కాకుండా పోయారు.

ఇపుడు కూడా అదే ప్రయత్నాలు మొదలయ్యాయా అన్న అనుమానాలు వినబడుతున్నాయి. కాకపోతే ఇపుడు ముందుగా చంద్రబాబుపైనే అనుమానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత జగన్ కు లాభించకుండా చంద్రబాబే మీడియా మద్దతుదారులతో పవన్ కు జాకీలేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గట్టెక్కాలంటే ప్రభుత్వవ్యతిరేక ఓట్లలో చీలిక తెచ్చి మళ్ళీ అధికారాన్ని అందుకోవాలన్న చంద్రబాబు వ్యూహంలో భాగమే పవన్ చుట్టూ మీడియాను నిలబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియాతో జాగ్రత్తగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, సామాజిక వర్గంలోని మద్దతు దారులు పవన్ను హెచ్చరిస్తుండటం గమనార్హం.