కులాల కంపు కొడుతున్న ‘నందులు’

కులాల కంపు కొడుతున్న ‘నందులు’

ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం సంగతి ఎలాగున్నా సినీ ఫీల్డ్ లోని సామాజిక వర్గాల కంపును బయటపడేస్తోంది. ఫీల్డ్ లోని ప్రముఖులు దశాబ్దాల క్రితమే సామాజిక వర్గాల వారీగా చీలిపోయీరు. కాకపోతే వాళ్ళ మధ్య ఎన్ని వివాదాలొచ్చినా బయటపడకుండా లోపల్లోపలే సర్దుకునేవారు. బయటకు వచ్చినపుడు మాత్రం తమదంతా ఒకటే కులమంటూ చాలా కలరింగులే ఇస్తుంటారు. అటువంటిది ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల పుణ్యమా అంటూ కుల సమీకరణలు స్పష్టంగా బయటకు వచ్చేస్తున్నాయి.

విచిత్రమేమిటంటే అవార్డులు అందుకున్న వారిలో అత్యధికులు చంద్రబాబునాయుడు సామాజికవర్గానికి చెందిన వారవటంతో వారికి వ్యతిరేకంగా మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళందరూ ఏకమవుతున్నారు. సినిమా ఫీల్డ్ లో కమ్మ-కాపు సామాజికవర్గాలు బలమైన ముద్రను కలిగి ఉన్నాయి. మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వారిలో తమ అవసరాల కోసం పై రెండు కులాల ప్రముఖులతో కలిసి నడుస్తున్నారు. అయితే, కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మిగిలిన కులాల ప్రముఖులు అందులోనూ బాహాటంగా రోడ్డెక్కటం బహుశా ఇదే మొదటిసారేమో.

లెజెండ్ సినిమాకు అందులో నటించిన బాలకృష్ణకు 2014 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు క్యాటగిరీ క్రింద మొత్తం 4 నంది అవార్డులు దక్కటంతోనే కందిరీగల తుట్టెను కదిపినట్లైంది. దానికి తోడు జగపతిబాబు, మహేష్ బాబు, రాజమౌళి, జూనియర్ ఎన్టీర్ కు కూడా నంది అవార్డులు ప్రకటించటంతో కులాల కంపు ఒక్కసారిగా గుప్పుమంది.  దాంతో మిగిలిన కులాల వాళ్ళంతా ఏకమవుతున్నారు. ఎడాపెడా మీడియాలో ఇంటర్వ్యూలిచ్చేస్తూ చివరకు అవార్డుల విశ్వసనీయతనే ప్రశ్నించేస్తున్నారు. ‘సైకిల్ నందు’లని, ‘పచ్చ నందు’లని ప్రముఖులే వ్యాఖ్యానిస్తుండటం నిజంగా ప్రభుత్వానికి అవమానమే.

లెజెండ్ సినిమాకు అవార్డులు దక్కటం ఒక కోణమైతే రుద్రమదేవి సినిమాకు అవార్డులు రాకపోవటంపైనే పలువురు మండిపడుతున్నారు. రుద్రమదేవి సినిమా దర్శకుడు గుణశేఖర్ కు మద్దతుగా, నంది అవార్డుల ఎంపికకు వ్యతిరేకంగా ఆర్ నారాయణమూర్తి, నల్లమలుపు బుజ్జి, బండ్ల గణేష్, బన్నీ వాస్ తదితరులు బాహాటంగానే ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. నంది అవార్డులు ఇంతలా వివాదాస్పదమవటం బహుశా ఇదే మొదటిసారేమో? అందులోనూ సామాజిక వర్గాల వారీగా చీలిపోయి అవార్డులను విమర్శించటం గమనార్హం.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos