అమరావతి: టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారనే నెపంతో  టీడీపీకి చెందిన మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మెన్ సహా మరో 8 మందిపై పోలీసులు కేసులు పెట్టారు.

మంగళగిరి మున్సిపల్  కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  టిడ్కో ఇళ్లను అనర్హులకు కేటాయించారని కమిషనర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్టుగా పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 420, 415, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

టిడ్కో ఇళ్ల కేటాయింపు అంశంపై  ఏపీ అసెంబ్లీలో ఈ నెల 1వ తేదీన అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. మంగళవారం నాడు సాయంత్రం అసెంబ్లీ నుండి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. చంద్రబాబు మినహా 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

టిడ్కో ఇళ్ల విషయమై ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో  అధికార విపక్షాల మధ్య ప్రతి రోజూ మాటల యుద్దం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ విషయమై ఈ రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకొన్నాయి.