ఏపీ రాజకీయాల్లో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో పాటు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. జగన్ గెలుపుపై చంద్రబాబు, లోకేశ్ అక్కసుతో ఉన్నారని.. వైసీపీకి ఓటేశారని తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆయన డీజీపీకి వివరించారు.

సీఎం జగన్, హోంమంత్రి సుచరితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని డీజీపీ దృష్టికి తెలిపారు ఆళ్ల. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.

ఎన్నికలు ముగిసిన నాటి నుంచి  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారని ఆళ్ల ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సుచరిత, వైఎస్ జగన్‌లపై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని కోరినట్లుగా రామకృష్ణారెడ్డి తెలిపారు.

కిరాయి గూండాలతో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆళ్ల ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గాను చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌ తమ కార్యకర్తలను అదుపులో పెట్టాలని ఆళ్ల సూచించారు.