ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మంగళగిరి ఎయిమ్స్ నిపుణుల బృందం చేరుకుంది. నలుగురు వైద్యుల బృందం సీఎస్ఎఫ్ అనాలసిస్ చేసింది. రిపోర్ట్ రావడానికి 24 గంటలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బ్లడ్, యూరిన్ టెస్టుల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కోవిడ్ నిర్థారణ కోసం మరోసారి బాధితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం చేశారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఏలూరుకు వెళ్లనున్నారు.

అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన బాధితులను సీఎం పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి వింత వ్యాధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

మరోవైపు ఏలూరులో మొత్తం బాధితుల సంఖ్య 300కు పెరిగింది. ఇప్పటి వరకు ఆసుపత్రి నుంచి 122 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్లిన రోగుల ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది వైద్య బృందం.

మెరుగైన వైద్యం కోసం పది మంది రోగుల్ని విజయవాడకు తరలించారు అధికారులు. లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గాలి, నీరు కలుషితం కాలేదని నిపుణులు తేల్చి చెప్పారు.