Asianet News TeluguAsianet News Telugu

మాండౌస్ తుఫాను ఎఫెక్ట్: దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు !

Vijayawada: మాండౌస్ తుఫాను ప్ర‌భావంతో ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంద‌ని పేర్కొంటూ.. ప్రభుత్వం జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేసి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
 

Mandous cyclone effect: Heavy to very heavy rainfall likely to occur in south coastal districts
Author
First Published Dec 10, 2022, 3:55 AM IST

Mandous cyclone effect: మాండౌస్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్ర‌దేశ్ లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తా జిల్లాలు అధిక‌ ప్రభావితమయ్యే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ తుఫాను కారణంగా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 65-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ప్రభుత్వం జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేసి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా రానున్న 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో, రాష్ట్రంలో గత 24 గంటల్లో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, తీవ్ర వాయుగుండం శుక్రవారం బలహీనపడి తుఫాన్‌గా మారిందనీ, శనివారం తెల్లవారుజామున పుదుచ్చేరి- నెల్లూరు జిల్లా శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంద‌ని ఐఎండీ పేర్కొంది. 

తుపాను దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల అధికారులందరినీ అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఇప్పటికే సూచించింది. మాండౌస్ తుఫాను కారణంగా సముద్ర స్నానాలు చేయరాదని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. అంతేకాకుండా, శనివారం ఉదయం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే, శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు దాదాపు 18 గంటల పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ వెంబడి సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. తుఫాను సమయంలో ఖగోళ అలల కంటే దాదాపు 0.5 మీటర్ల ఎత్తులో తుఫాను ఉప్పెన దక్షిణ కోస్తా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది. గుడిసెలు, విద్యుత్, కమ్యూనికేషన్ లైన్లతో పాటు అర‌టి, బొప్పాయి పంటకు న‌ష్టం జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ పేర్కొంది.

రంగంలోకి NDRF, SDRF బృందాలు.. 

మాండౌస్ తుఫాను దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఇప్పటికే ఐదు ఎన్‌డిఆర్‌ఎఫ్, నాలుగు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. ప్రకాశం జిల్లాలో రెండు బృందాలు, నెల్లూరులో 3, తిరుపతిలో రెండు, చిత్తూరు జిల్లాలో మరో రెండు బృందాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తుంది. కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా APSDMA ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని కోటి మందికి పైగా ప్ర‌జ‌ల‌కు హెచ్చరిక సందేశాలను పంపింది. 

రైతుల ఆందోళన

తుఫాను వల్ల తమ పంటలు మరోసారి దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వరి కోతలు 30% మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 70 శాతం వరి కోతలు జరగాల్సి ఉంది. ఈ స‌మ‌యంలో తుఫాను రావ‌డంతో రైతులు ఆందోళ‌న‌లో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios