అమరావతి:  ప్రతిపక్ష నేతగా మూడువేల కి.మీ పాదయాత్ర చేసిన జగన్  సీఎం అయిన తర్వాత తమకు  36 కి.మీ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృస్ణ మాదిగ విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ చిలుక పలుకులు పలికాడని మందకృష్ణ మాదిగ విమర్శించారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని  మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. 

అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కూడ ఇదే పని చేశాడని ఆయన గుర్తు చేశారు. అందుకే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కు కూడ పడుతోందని ఆయన విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు.  ఈ వ్యాఖ్యలను విరమించుకోవాలని గాంధేయ పద్దతిలో ఈ నెల 20న గుంటూరు నుండి అసెంబ్లీ వరకు యాత్ర తలపెట్టినట్టుగా మందకృష్ణ చెప్పారు.

ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ముట్టడిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగను అరెస్ట్ చేయడాన్ని మందకృష్ణ మాదిగ తప్పుబట్టారు.