అమరావతి: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీని బురిడి కొట్టించబోయిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు.  తెలివిగా వ్యవహరించిన విడదల రజిని అతని నుంచి బయటపడింది. తాము భారీ మొత్తంలో రుణాలు ఇస్తామంటూ ఓ వ్యక్తి రజినికి ఫోన్ చేసి చెప్పాడు. 

తాను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. మీతో సీఎం జగన్ మాట్లాడాలని చెప్పినట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. రుణం కావాలంటే ముందుగానే కొంత సొమ్ము చెల్లించాలని చెప్పాడు. దాంతో అనుమానం వచ్చి రజిని అతని వివరాలు సేకరించారు. 

విశాఖకు చెందిన జగజ్జీవన్ అనే పేరుతో సీఎం కార్యాలయంలో ఎవరైనా ఉన్నారా అని రజిని ఆరా తీశారు. అలాంటి పేరుతో ఎవరూ లేరని తెలుసుకున్న రజని తెలివిగా వ్యవహరించారు. జగజ్జీవన్ తో ఫోన్ తో మాట్లాడుతూనే డీజీపీకి, గుంటూరు ఎస్పీకి సమాచారాన్ని చేరవేశారు .ఆ తర్వాత పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు కూడా ఆ వ్యక్తే ఫోన్ చేసి డబ్బులు అడిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో మీడియా ముందు ప్రవేశపెడుతామని పోలీసులు చెప్పారు.