సారాంశం
శ్రీసత్యసాయి జిల్లాలో పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం కోసం వెళ్లిన శంకరనారాయణను అడ్డుకున్న ప్రజలు.. ఆయన తిరిగి వెళ్తుంటే వాహనంపై చెప్పులు విసిరారు.
శ్రీసత్యసాయి జిల్లాలో పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం కోసం వెళ్లిన శంకరనారాయణను అడ్డుకున్న ప్రజలు.. ఆయన తిరిగి వెళ్తుంటే వాహనంపై చెప్పులు విసిరారు. అయితే సొంత పార్టీకి చెందిన వారే ఈ దాడి చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు.. శంకరనారాయణ ఈరోజు సోమందేపల్లి మండలం ఈదలబలాపురం పరిధిలోని రేణుకానగర్‌లో ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం చేపట్టేందుకు వెళ్లారు. అయితే శంకరనారాయణను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావొద్దని అన్నారు.
రేణుక నగర్‌లో ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వకుండా చేశారని, అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే శంకరనారాయణ పోలీసుల సాయంతో గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారించినప్పటికీ.. గ్రామస్తులు వినిపించుకోలేదు.
దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే శంకరనారాయణ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ క్రమంలో శంకరనారాయణ వాహనంపై కొందరు చెప్పులు విసిరారు. అయితే ఈ దాడి వెనక వైసీపీకే చెందిన నాగభూషణ్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఈ పరిణామాలపై స్పందించిన నాగభూషణ్ రెడ్డి.. గ్రామంలో అభివృద్దిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ మీద ఆయనను వదిలిపెట్టామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ పరిణామాలు జిల్లా వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.