గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన  వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అతను ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

అతన్ని అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సమయంలో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

రాష్ట్రంలో పోలీసు  రాజ్యమేలుతోందని నారా లోకేష్ విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలను పథకం ప్రకారమే అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కులాలను మతాలను అడ్డంపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన కూడా కులం రంగు వేయడం దారుణమని లోకేష్ అన్నారు.

 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తన కార్యకర్తలను ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్లందరి పై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి లెక్క లేదని, భయంకరమైన కరోనా వ్యాధి గురించి కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.