ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇటీవల ఆమెకు కుటుంబసభ్యులు పెళ్లి కుదిర్చారు. పెళ్లిరోజు రానే వచ్చింది. మరి కొద్ది క్షణాల్లో వరుడు.. సదరు యువతి మెడలో తాళి కట్టబోతున్నాడు. అంతే.. అక్కడికి ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడపకు చెందిన ఓ యువతి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. తన సహచరుడైన చెన్నై యువకుడితో ప్రేమాయణం సాగించింది. అయితే తల్లిదండ్రులకు ఆమె ఈ విషయం చెప్పలేదు. వారు చూసిన పెళ్లి సంబంధానికి అంగీకరించింది. గుర్రంకొండకు చెందిన ఓ ఉద్యోగస్తుడితో వివాహం నిశ్చయించి శుక్రవారం ముహూర్తం పెట్టుకున్నారు. ఇరుపక్షాల నుంచి పెద్ద ఎత్తున బంధుమిత్రులు స్థానిక కల్యాణ మండపానికి వచ్చారు. కోలాహలంగా గురువారం రాత్రి రిసెప్షన్‌ కూడా నిర్వహించారు. అప్పటివరకు సజావుగా సాగిన పెళ్లి తంతు అర్ధరాత్రి 2 గంటల అనంతరం పోలీసుల ప్రవేశంతో ఆగిపోయింది. అసలు విషయం ఏమిటంటే..ఆమె ప్రియుడు తమిళనాడు పోలీసులకు, అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీనిపై సమాచారం అందడంతో స్థానిక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఇరుపక్షాల వారికి విషమేమిటో చెప్పారు. నవవధువును ప్రశ్నించడంతో తనకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చిచెప్పింది. ఉదయం 8 గంటల వరకు పంచాయితీ చేసినా నవ వధువు ప్రియుడుతో వెళ్లడానికి మొగ్గుచూపింది. దీంతో పెళ్లికొడుకు బృందం కల్యాణ మండపం వదిలి వెళ్లిపోయింది. పోలీసులు నవ వధువును, వారి తల్లిదండ్రులను స్థానిక తహశీల్దార్‌ అమరనాథ్‌ ముందు హాజరుపరిచారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకొన్న తహసీల్దార్‌ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.