సుమారు 45 రోజుల నిరీక్షణ తర్వాత గురువారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి ఏ పార్టీ గెలుస్తుంది..? ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

దీంతో రేపు జనం టీవీల ముందు అతుక్కుపోయే అవకాశం ఉంది. ఎంతటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ బయటకు వెళ్లరు. ఇలాంటి సమయంలో శుభకార్యాలు వస్తే పరిస్థితి ఏంటి..?

ఇలాంటి వారి కోసం ఓ పెళ్లింటి కుటుంబం వినూత్న ఏర్పాట్లు చేసింది. తన పెళ్లి చిరకాలం గుర్తుండిపోవాలని భావించిన ఓ యువకుడు పట్టుబట్టి మరీ 23నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన నారికేళపు చిన్నసుబ్బారావు, రావమ్మల కుమారుడు రామకోటయ్యకు మాదల గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు, తులసి దంపతుల కుమార్తె వినీలతో 23న వివాహం నిశ్చయించారు.

అయితే అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పెళ్లికి విచ్చేసే బంధు మిత్రుల కోసం వివాహ వేడుకలో టీవీలు ఏర్పాటు చేసి ఫలితాలు అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

అక్కడితో ఆగకుండా ఈ విషయాన్ని ఏకంగా వెడ్డింగ్ కార్డ్‌‌లు ఇస్తూ ప్రత్యేకంగా తెలియజేశారు. దీంతో పెళ్లికి వెళ్లినట్లు ఉంటుంది.. ఫలితాలు చూసినట్లు ఉంటుందని భావించిన బంధువులు పెళ్లికి తప్పకుండా వస్తామని చెబుతున్నట్లుగా సమాచారం.