కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యాపారి వావివరసలు మరిచి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు వరసయ్యే ఓ వివాహితపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి సదరు మహిళ దైర్యంగా బయటపెట్టడంతో పెద్దమనిషిగా చెలామని అవుతున్న ఆ వ్యాపారి అసలు స్వరూపం బయటపడింది. ఈ అమానుష ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడ పట్టణంలోని సింగ్ నగర్ లో తాళ్లూరి శ్రీనివాస రావు కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి భార్య స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఇతడు విజయవాడలోనే ఓ బార్‌ను పార్ట్‌నర్లతో కలిసి నడుపుతూ వడ్డీ వ్యాపారం కూడా నిర్వహించేవాడు.

అయితే శ్రీనివాసరావుకు మేనల్లుడి వరసయ్యే ఓ వ్యక్తి అవసరాల నిమిత్తం రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో వడ్డీ వసూలు చేసుకోడానికి ఇతడు తరచూ మేనల్లుడి ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో మేనల్లుడి భార్య(వరసకు కూతురు)పై కన్నేశాడు. భర్త లేని సమయంలో ఆమె వద్దకు వెళుతూ మాటలు కలిపేవాడు. అయితే అతడి పాడు ఆలోచన  గురించి తెలియని సదరు మహిళ చనువుగా వుండేది. 

ఈ క్రమంలోనే ఓరోజు ఆమె ఒంటరిగా వున్న సమయంలో బెదిరించి బలత్కారానికి పాల్పడ్డాడు. ఎవరికీ  చెప్పవద్దని...చెబితే నీ సంసారమే నాశనం అవుతుందంటూ బెదిరించాడు. అయితే అతడి బెదిరింపులకు భయపడిన ఆమె భర్తకు జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. 

దీంతో భార్యను తీసుకుని అతడు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీనివాసరావు ను అరెస్ట్ చేసి 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.