బాపట్ల, నగరం మండలం పూడివాడ సమీపంలో ఓల్డ్ కోర్స్ మురుగు కాల్వలో గత నెల 4న హత్యకు గురైన వివాహిత కొటారి సామ్రాజ్యం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకానం.. చెరుకుపల్లి కొత్తపేటకు చెందిన కొటారి సామ్రాజ్యంతో అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన పొతర్లంక శ్రీనివాసరావుకు ఇరవై ఏళ్లనుంచి వివాహేతర సంబంధం ఉంది. 

ప్రస్తుతం  శ్రీనివాసరావు బాపట్లలోని బెస్తపాలెంలో నివసిస్తున్నాడు. చెడువ్యసనాలకు అలవాటు పడి  శ్రీనివాసరావు అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా డబ్బులు కావాలని ప్రియురాలి వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువుల మీద కన్నుపడింది. దీంతో ఆమెను చంపితే కానీ అవి దక్కవని అర్థమయింది. దీనికోసం గత నెల 3న సామ్రాజ్యాన్ని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని నిజాంపట్నం మండలం కోనఫలంలో వివాహిత బంధువుల ఇంట్లో వదిలిపెట్టాడు. 

అదే రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరిగి ఆమెను తీసుకువస్తూ ముందుగా వేసుకున్న ప్రణాళిక అమల్లో పెట్టాడు. కూల్ డ్రింక్ లో మందు కలిపి ఆమెతో తాగించాడు. మత్తులోకి వెళ్లాక ఆమెను చంపి ఒంటిమీదున్న నగలు దోచుకున్నాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓల్డ్ కోర్స్ మురుగుకాల్వలో పడేసి వెళ్లిపోయాడు. 

తెల్లారి కాల్వలో మృతదేహం కలకలం సృష్టించడంతో పూడివాడ వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందు కాల్వలో నీళ్లలో మునిగి చనిపోయినట్టు కేసు నమోదు చేశారు. అయితే శ్రీనివాసరావు సామ్రాజ్యంను చంపిన సంగతి భార్య పద్మావతికి చెప్పాడు. ఆమె నగలను ఇద్దరు కలిసి బాపట్లలో లక్షా పాతికవేలకు అమ్మేశారు. 

ఆ తరువాత చాలా ప్రాంతాలు తిరిగారు. సామ్రాజ్యం హత్య విషయం పోలీసులు విచారిస్తున్నారని తెలిసి భయంతో స్థానిక వీఆర్వో దగ్గర లొంగిపోయారు. చోరీ చేసిన బంగారు వెండి నగలను రికవరీ చేశారు.