బంధువులందరి సమక్షంలో మేనకోడలి మెడలో తాళి కట్టాడు. పెళ్లి జరిగిన  మూడు వారాలకే.. మరో యువతి మెడలో తాళికట్టాడు. ఎవరికీ తెలీకుండా ప్రేయసిని అన్నవరం తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కాగా.. ఈ పెళ్లికి పెద్దలు పంచాయతీ పెట్టి తాళికి వెల కట్టాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నానికి చెందిన 26ఏళ్ల యువకుడు అదే గ్రామానికి చెందిన తన మేనకోడలితో ఇటీవల వి వాహమైంది. ఆ పెళ్లి చేసుకున్న మూడు వారాలకే సదరు యువకుడు తన ప్రేయసి మెడలో పసుపుతాడు కట్టి పెళ్లి చేసుకున్నానని అనిపించాడు.

ఈ విషయం కాస్త సదరు యువకుడి మొదటి భార్యకు తెలిసిపోయింది. దీంతో.. ఆమె తన తల్లిదండ్రులకు విషయం తెలియజేసి పెళ్లికొడుకును నిలదీసింది. తమ కుమార్తె జీవితం నాశనం చేశారంటూ వారు పంచాయితీ పెట్టారు. కాగా.. సదరు పంచాయితీ పెళ్లి.. యువకుడి రెండో పెళ్లి రద్దు చేసుకోవాలంటూ సూచించారు.

ప్రియురాలితో తెగతెంపులు చేసుకోవడానికి పరిహారంగా రూ. రెండున్నర లక్షలు చెల్లించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. తొలి విడతగా కొంత నగదు కూడా అప్పగించారు. మిగిలిన డబ్బులను తరువాత చెల్లించేలా హామీపత్రం కూడా రాయించారు. ఈ సమస్యను తీర్చినందుకు వారి వద్ద నుంచి పంచాయితీ పెద్దలు రూ.50 వేలు తీసుకోవడం కొసమెరుపు.

అయితే.. ప్రియురాలితో పెళ్లి రద్దు చేయించినందుకు సదరు యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ వ్యవహారమంతా అధికార పార్టీకి చెందిన కొందరు నేతల సమక్షంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.