బద్వెల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వెల్ సుందరయ్య నగర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె పక్కన పడుకుని సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ సంఘటన సుందరయ్యనగర్ లో తీవ్ర సంచలనం సృష్టించింది.

మంజులను హరి అనే వ్యక్తి ఏడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఏం జరిగిందో గానీ అతను భార్య మంజులను హత్య చేశాడు. ఆ తర్వాత హరి పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

భార్యపై అనుమానంతోనే హరి హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, అనుమానం వల్లనే హరి భార్య మంజులను చంపాడా,  కుటుంబ కలహాల కారణంగా చంపాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తమపై కూడా అల్లుడు దాడి చేయడానికి ప్రయత్నించాడని మంజుల తల్లిదండ్రులు అంటున్నారు. 

పోలీసులు హరిని విచారిస్తున్నారు. అతను విచారణలో చెప్పే విషయాల ఆధారంగా ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.