అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పన్నూరు స్వామి (27) అనే యువకుడిని అతని మామనే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో మామ తలపై కర్రతో బాది అతన్ని హత్య చేశాడు. 

ఉరవకొండ పోలీసు సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ రెడ్డి ఆ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన కూతురిని కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన పన్నూరుస్వామికి ఇచ్చి వివాహం చేశాడు. 

పెళ్లయిన తర్వాత కొద్ది రోజులకే పన్నూరుస్వామి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసన మామ ఎర్రిస్వామి అల్లుడు పన్నూరిస్వామిని పలుమార్లు హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. అయితే, పన్నూరుస్వామిలో ఏ విధమైన మార్పు కూడా రాలేదు. 

కాగా, ఎర్రిస్వామి తన అల్లుడు పన్నూరుస్వామిని ఏప్రిల్ 28వ తేదీన బెళగుప్ప మండలం దుద్దేకుంట గ్రామంలో జరిగిన ఓ పెళ్లికి తీసుకుని వెళ్లాడు. తన స్వగ్రామం వెళ్తానని చెప్పి పన్నూరుస్వామి రాకెట్లకు వెళ్లాడు. విషయం తెలిసిన మామ అల్లుడిని చంపాలని పథకం వేసుకున్నాడు. ఏప్రిల్ 29వ తేదీ తెల్లవారు జామున వై. రాంపురం గ్రామ సమీపంలో కాపు కాశాడు. 

రాకెట్ల నుంచి టూవీలర్ మీద వస్తున్న అల్లుడి తలపై కర్రతో బలంగా కొట్టాడు. దాంతో పన్నూరుస్వామి మరణించాడు దానపై పన్నూరుస్వామి దుర్గన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఎర్రిస్వామి నేరం అంగీకరించాడు. దాంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.