ఆవేశం అనర్థాలకు చేటు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఓ వ్యక్తి క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బొమ్మనహాల్ మండలం తారకాపురం గ్రామానికి చెందిన ఉలిగమ్మ, ఈరన్న దంపతుల ఏకైక కుమారుడు సురేష్(25) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వేరే గ్రామానికి చెందిన తిప్పమ్మ, తిప్పయ్యల కుమార్తె లలిత(20) తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిపించారు.

Also Read స్నేహితుడికి చెప్పు తగిలిందని గొడవ..చివరకు.

తొమ్మిది నెలలు గడుస్తున్నా.. లలితకు గర్భం రాలేదు. దీంతో.. దంపతులు సంతానం కోసం దగ్గర్లోని కళ్లుహోళ గ్రామంలోని పీర్లదేవుని గుడికి వెళ్లారు. పలుమార్లు గుడికి వెళ్లివచ్చినా కూడా ఆమె గర్భం రాలేదు. దీంతో.. ఈ విషయంలో దంపతులు ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది.

తీవ్ర ఆవేశానికి గురైన సురేష్.. కోపంలో భార్యను నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను రక్తపు మడుగులో చూసిన తర్వాత తాను చేసిన తప్పేంటో తనకు అర్థమయ్యింది. భయంతో వణికిపోయాడు.

పోలీసులు తనను పట్టుకుపోతారనే అనే భయంతో ఇంటికి సమీపంలోని జొన్న చేనులో ఉన్న వేప చెట్టుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు సురేష్‌ పెళ్లయిన రెండు నెలల నుంచే భార్యపై అనుమానంతో కూలి పనులకు కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచేవాడని  మృతురాలి తండ్రి తిప్పయ్య పేర్కొన్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కణేకల్లు ప్రభుత్వాస్పత్రికు తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజా తెలిపారు.