తన స్నేహితుడికి ఎవరిదో కాలి చెప్పు వచ్చి తగలడంతో చూస్తూ ఊరుకోలేకపోయాడు... ఆ చెప్పు ని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. ఆ చెప్పు విషయంలోనే మరో విద్యార్థితో గొడవ పడ్డాడు. చివరకు కొట్టుకునేదాక వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుర్రంకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన ఎ.వెంకట్రమణ, శాంతి రెడ్డి దంపతులు ఇటీవల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి ఏకైక కుమారుడు అశోక్ కుమార్(15) మదనపల్లెలోని ఈశ్వరమ్మ కాలనీలో ఉంటున్న మేనత్త కుమారి, మామ రమణల వద్ద ఉంటున్నాడు.

అక్కడే ఉంటూ మదనపల్లి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు.  కాగా.. గురువారం క్లాస్ లో ఓ విద్యార్థి చెప్పు వచ్చి అశోక్ కుమార్ స్నేహితుడికి తగిలింది. దీంతో.. అశోక్ కోపంతో ఆ చెప్పుని బ్లేడ్ తో ముక్కులు ముక్కలుగా కత్తిరించాడు.

Also Read అనుమానం... భార్యను డ్రైనేజీలోకి నెట్టి మరీ...

అయితే.. తన చెప్పు ఎందుకు కత్తిరించావంటూ సదరు విద్యార్థి అశోక్ కుమార్ తో గొడవ పడ్డాడు. ఆ విద్యార్థికి కరాటేలో ప్రావీణ్యం ఉండటంతో అశోక్ కుమార్  ఆ దెబ్బలు తట్టుకోలేకపోయాడు.  దెబ్బలు తాళలేక అశోక్‌  కిందపడి స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు అశోక్‌కుమార్‌ను వెంటనే వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అశోక్ చనిపోయిన విషయాన్ని బాలుడి మేనత్తకు సమాచారం అందించారు. విద్యార్థి మృతి చెందిన ఘటన తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి జడ్పీ హైస్కూల్‌కు చేరుకుని ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై విచారించారు. ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ హెచ్‌ఎం రెడ్డెన్నశెట్టిలను విచారించారు. నిందితుడైన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

కాగా... విద్యార్థులు ఇద్దరు చచ్చిపోయేలా కొట్టుకుంటున్నా.. కనీసం పట్టించుకోకుండా ఉపాధ్యాయులు ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నూటికి నూరుపాళ్లు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే విద్యార్థి చావుకి కారణమనే వాదనలు వినపడుతున్నాయి.