వివాహేతర సంబంధం... ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యింది.  అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని... అడ్డుగా ఉన్నాడని అతనినే హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని వెల్లటూరుకు చెందిన అంకె ఏడుకొండలు పశువులు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు.శుక్రవారం ఉదయం గేదేలను తీసుకొని అడవికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో... అతని కుటుంబసభ్యులు, స్నేహితులు అతని కోసం అడవిలో గాలించగా... ఓ గోనె సంచిలో శవమై కనిపించాడు. 

అతని మెడ నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే... ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు భార్యతో నాగయ్య అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఏడు కొండలు, నాగయ్య ల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి.

అయితే... ఏడుకొండలు అడ్డు తప్పిస్తే... అతని భార్యతో సంతోషంగా ఉండవచ్చని ఇటీవల నాగయ్య పథకం వేశాడు. ఈ పథకం ప్రకారం ఏడుకొండలు అడవికి వెళ్లడాన్ని గమనించి అక్కడ హత్య చేశాడు. మెడకోసి హత్య చేసి... అనంతరం శవాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.