కడదాకా తోడుగా ఉంటానంటూ మాటఇచ్చాడు. అగ్నిసాక్షిగా మెడలో తాళికట్టి తనదానిని చేసుకున్నాడు. కానీ చివరకు.. తాను కట్టిన తాళితోనే భార్యకు ఉరివేశాడు.  కనీసం భార్య కడుపుతో ఉందనే కనికరం కూడా లేకుండా దారుణంగా చంపేశాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తికి రెండు వివాహలు జరిగాయి. మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేయడంతో మొదటి భార్య అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత రెండేళ్ల క్రితం గణపరానికి నంగాలమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. అబ్బులు, నంగాలమ్మ దంపతులకు 9 నెలల బాలుడు ఉన్నాడు. మొదటి భార్య వెళ్లిపోయినప్పటికీ అబ్బులు ప్రవర్తనలో మార్పు రాలేదు. మద్యం తాగి రెండో భార్యను కూడా నిత్యం వేధించేవాడు.

తరచూ భార్యను అనుమానించేవాడు.  దీంతో... రెండో భార్య నంగాలమ్మ కూడా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. దీంతో.. తాను మారిపోయానంటూ నమ్మించి.. భర్తను మళ్లీ తన ఇంటికి తెచ్చుకున్నాడు. అతడి మాటలు నమ్మి జూలై 17న నంగాలమ్మ, తన కుమారుడితో కలిసి భర్త వద్దకు వెళ్లింది. కానీ ఆ మరుసటి రోజే మళ్లీ నరకం చూపించాడు అబ్బులు. మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న నంగాలమ్మపై అనుమానం పెంచుకొని నిలదీశాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవ పెద్దదయ్యింది. ఈ క్రమంలో ఆవేశంలో.. భార్య మెడలో తాను కట్టిన తాళితోనే ఉరివేసి హత్య చేశాడు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.