కన్న కొడుకుని ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇంటి పెరట్లో పనిచేస్తున్న కొడుకుపై తండ్రి సుత్తితో దాడిచేసి మరీ చంపాడు. ఈ దారుణ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం పెందుర్తి కి చెందిన గోరుపాటి వీర్రాజు.. సీమేన్ గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందాడు. కాగా.. ప్రస్తుతం చినముషివాడ సత్యానగర్ లోని తన కుమారుడు జలరాజు(41) తో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా జలరాజు కూడా సీమేన్ గా పనిచేస్తున్నాడు. కాగా... ఇటీవల జలరాజు డ్యూటీకి వెళ్లి.. తిరిగి ఇంటి వచ్చాడు.

అనంతరం ఇంటి పెరట్లో కొద్దిగా ఏవో పనులు ఉండటంతో..  వాటిని సరిచేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వీర్రాజు సుత్తితో కొడుపై దాడి చేశాడు. సుత్తితో తలపై కొట్టాడు. కుమారుడి తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. నిందితుడు  పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా వీర్రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.