స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి ప్రశ్నించాడని... అడ్డుగా ఉన్న స్నేహితుడిని చంపేందుకు పథకం వేశాడు. మరో ఇద్దరు స్నేహితుల సాయంతో పీకల దాకా మద్యం తాగించి పథకం ప్రకారం హత్య చేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడంటూ అందరినీ నమ్మించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నిడిగుంటపాళెంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిడిగుంటపాళెనికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తికి పెళ్లై భార్య ఉంది. కాగా.. ప్రకాష్‌ భార్యకు అతని స్నేహితుడైన ఇడిమేపల్లి గ్రామానికి చెందిన ఎ.వెంకటేష్‌కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ప్రకాష్‌కు తెలిసి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రకాష్‌ ఇదంతా నీ వల్లే జరిగిందంటూ వెంకటేష్‌తో గొడవపడేవాడు. 

దీంతో వెంకటేష్‌ ప్రకాష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితులైన చెన్నకృష్ణయ్య, విజయభాస్కర్‌ల సాయం కోరాడు. వీరు ముగ్గురూ కలిసి గత నెల 30వ తేదీన మద్యం తాగుదామని చెప్పి ప్రకాష్‌ను నక్కలకాలువ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. అక్కడ గొంతు నలిపి హత్య చేసి కాలువలో పడి చనిపోయాడని అందర్ని నమ్మించారు. 

పోస్టుమార్టం నివేదికలో ప్రకాష్‌ ప్రమాదవశాత్తు చనిపోలేదని తెలియడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈక్రమంలో వెంకటేష్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారింగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్‌ చేశారు.