వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లెకు చెందిన రేష్మను పుల్లలచెరువుకు చెందిన కె.ముసలయ్యకు ఇచ్చి 2016లో వివాహం చేశారు.

పెళ్లి సమయంలో కట్నం కింద రూ.80 వేలు, ఆ తర్వాత రూ.20 వేలు ఇచ్చారు. పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత ఆడపిల్ల రేష్మ పుట్టింది. అప్పటి నుంచి తన కూతురిని తీవ్రంగా వేధించేవాడని మృతురాలి తల్లి జరీనా వాపోయింది. నిత్యం తాగివచ్చి గొడవ పడుతుండేవాడని, ఈ విషయాన్ని తన కుమార్తె ఎవ్వరికీ చెప్పకుండా బాధలు భరిస్తూ కాపురం చేసుకుంటుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో ముసలయ్య అక్రమ సంబంధం గురించి అడిగినందుకు రేష్మను అతికిరాతకంగా హత్యచేశాడని అడ్డువస్తుందని ముక్కుపచ్చలారని పసికందును సైతం గొంతుకు తీగ బిగించి హత్యచేశాడని ఆమె వాపోయింది.

కాగా మీ కుమార్తె గొడవ పడుతుందని ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముసలయ్య ఫోను చేశాడని, అందుకు తాను సర్ధిచెప్పినట్లు మృతురాలి తండ్రి హుసేనయ్య తెలిపాడు.

కాసేపు ఆగిన తర్వాత తన కుమార్తెతో ఫోన్ చేసి మాట్లాడానని, మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్లుండి లైన్ కట్ అయ్యిందని తెలిపాడు. అయితే ఆ తర్వాత రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నీ కుమార్తె ఉరివేసుకుని మరణించిందని ఫోను ద్వారా తెలిపాడని హుసేనయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల నుంచి కేకలు వినిపిస్తున్నాయని, భార్యాభర్తలు గొడవ పడుతున్నారని తాము అనుకున్నామని పరిసర ప్రాంతాలకు చెందిన వారు వెల్లడించారు.

అయితే ముసలయ్య తన భార్య రేష్మ, కుమార్తె రేష్మలను హత్య చేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు చీర కట్టి ఉరివేసుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు.

ముందుగా కుక్కర్ ప్లగ్ తీగతో గొంతుకు బిగించి హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత రేష్మ ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసి రక్తపు మరకలు పడకుండా జాగ్రత్త పడినట్లు వారు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.