ఓ వ్యక్తిని కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డు పక్కన పడేసిన సంఘటన అనంతపురం జిల్లాలోని హంపాపురం లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుుక్కపట్నం మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన సుదర్శన్ మూర్తి కొంతకాలంగా అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసం ఉంటున్నారు.

గాలిమరల కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు స్వగ్రామంలో 17 ఎకరాల పొలం ఉంది. నలుగురు సోదరుల మధ్య భూ వివాదం నడుసత్ోంది. ఈ విషయంపై మాట్లాడటానికి ఆయనను సోదరులు బుక్కపట్నం రావాలని చెప్పారు. దీంతో.. సుదర్శన మూర్తి ఈ నెల 4వ తేదీన అనంతపురం నుంచి కొత్త చెరువుకు వెళ్లి.. అక్కడి నుంచి ఆటోలో పుట్టపర్తి బయలుదేరారు.

అదే ఆటోలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కూడా ఉన్నారు. కొంత దూరం వెళ్లాక సుదర్శన్ మూర్తిని కిడ్నాప్ చేసి.. ఆటోలో నుంచి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఓ గిడ్డంగిలో దాచి బాగా చితకబాది పడేశారు. అపహరించిన ఆరు రోజుల తర్వాత హంపాపురం సమీపంలో కాళ్లు చేతులు కట్టేసి.. రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన  సోదరులే ఈ పనికి పాల్పడ్డారనే అనుమానాలు కలుగుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.