విశాఖలో దారుణం జరిగింది. పదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే... నగరంలోని మనోరమ థియేటర్ ప్రాంతంలో ఓ కుటుంబం కూలీపనులు చేసుకుంటూ జీవిస్తోంది. వీరి పదేళ్ల కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది.

రెండు రోజుల క్రితం చిన్నారి స్కూల్ నుంచి వచ్చి.. స్నేహితురాలితో ఆడుకుంటోంది. అదే ప్రాంతంలో ఉండే రాజేశ్ అలియాస్ టోనీ ఆ బాలికను పిలిచాడు. అనంతరం కారులోకి ఎక్కించి, చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులను కట్టేసి అత్యాచారానికి ప్రయత్నించాడు.

అయితే అక్కడున్న కొంతమంది యువకులకు అనుమానం రావడంతో వారు కారు వద్దకు వచ్చి చూశారు. దీంతో టోనీ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం సదరు యువకులు బాలికను ఇంటి దగ్గర అప్పగించారు.

అయితే ఆమె సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతుండటంతో తల్లి ఆరా తీయగా.. చిన్నారి జరిగిన విషయం చెప్పింది. స్థానికులు, మహిళా సంఘాల సూచనతో బాధితురాలి తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు... చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా.. నిందితుడు టోనీ గతంలో సమీప బంధువైన ఓ యువతిపై అత్యాచారయత్నం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఆ సమయంలో వేడి వేడి నూనెని అతనిపై పోసి యువతి తప్పించుకుంది.