కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కరోనా వచ్చిందనే అనుమానమే.. ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. కొందరికైతే తమకు అసలు వైరస్ సోకిందా లేదా అనుమానం కలుగుతోంది. పరీక్ష చేయించుకొని ఫలితం చేతిలో ఉన్నా కూడా అనుమానం అలానే ఉంటోంది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్, నెగిటివ్ అంటూ కన్ఫ్యూజ్ చేశారు. కాకినాడలో ఓ యువకుడు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అతడి రిపోర్టలు వచ్చాయి.. ముందు యువకుడికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సోమవారం ఫోన్ చేశారు. 

స్థానిక ఏఎన్‌ఎం వెళ్లి పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మళ్లీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ ద్వారా నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని యువకుడికి షాకిచ్చారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి పాజిటివ్‌ అన్నారు. దీంతో ఆ యువకుడు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడ.

చివరికి ఆ యువకుడికి కరోనా పాజిటివ్‌ అని అధికారులు నిర్ధారించి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి స్పందించారు. అతడికి పాజిటివ్‌ వచ్చిందని ఆయనా తేల్చి చెప్పారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ వల్ల పొరపాటు జరిగిందన్నారు. మొత్తానికి టెస్టుల విషయంలో గందరగోళంతో జనాలు ఇబ్బందులుపడుతున్నారు.